బంగాళదుంప చిప్స్ : బంగాళ దుంపలతో అప్పడాలు.. తయారు చేసుకోండిలా! టేస్ట్ సూపర్ గా ఉంటుంది

 బంగాళాదుంపలతో తినే కూరలే కాదు.. చిరుతిళ్లు కూడా చాలా ఉన్నాయి. మార్కెట్లలో లభించే లేస్ వంటి చిప్స్ లలోనే కాదు.. బిస్కెట్ల తయారీలోనూ బంగాళాదుంపలను వాడుతున్నారు. ఆలుగడ్డలతో తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ గురించైతే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. 


ఇవన్నీ కాదు గానీ.. ఇంట్లోనే బంగాళాదుంపలతో అప్పడాలు తయారు చేసుకుని.. వాటిని వేడివేడి నూనెలో వేయించి.. పప్పు, సాంబార్ రైస్ లో నంచుకుని తింటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇంకెందుకు లేటు.. ఇలా తయారు చేసేసుకోండి మరి.

బంగాళదుంపల అప్పడాల తయారీకి కావలసిన పదార్థాలు:  పెద్ద బంగాళాదుంపలు – 1కిలో, ఉప్పు – 3 టీ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి తగినంత

తయారీ విధానం: బంగాళదుంపలపై పొట్టును శుభ్రంగా చెక్కు తీసేసి నీటిలో వేసుకోవాలి. ఒక్కొక్క దుంపను తీసుకుని స్లైసర్ తో చిన్న చిన్న స్లైస్ లుగా కట్ చేసుకుని.. వాటిని నీటిలో వేసి కడగాలి. మరో గిన్నెలో నీరు పోసి.. అందులో కొద్దిగా ఉప్పువేసి వేడి చేయాలి. అవి వేడయ్యాక స్లైస్ గా చేసిన బంగాళదుంప ముక్కలను వేసి రెండు నిమిషాలు ఉడకించాలి. ఆ నీటిని వడగట్టి.. శుభ్రంగా ఉన్న కాటన్ వస్త్రాన్ని తీసుకుని.. బంగాళదుంప స్లైస్ లను ఒక్కొక్కటిగా దానిపై వడియాల మాదిరిగా ఉంచి ఎండలో పెట్టాలి. లేదా ఫ్యాన్ కిందైనా పూర్తిగా ఎండేంతవరకూ ఆరనివ్వాలి. కానీ ఎండలో పెడితే అవి పూర్తిగా ఆరతాయి. ఇలా తడి లేకుండా ఆరబెట్టిన లేదా ఎండబెట్టిన బంగాళాదుంప స్లైస్ లను డబ్బాలో గాలి తగలకుండా వేసి నిల్వ ఉంచుకోవాలి. ఇవి 6 నెలల వరకూ తాజాగా ఉంటాయి. ఎంతో సింపుల్ గా ఇలా ఆలూ అప్పడాలను తయారు చేసుకుని అన్నం తినేటపుడు నూనెలో వేయించుకుని తింటే .. ఆ రుచే వేరు.

Comments