వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం...

 మనం తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. శరీరానికి తగిన పోషకాలు అందే ఆహారాలు తీసుకోవాలి. అంటే ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు, నట్స్ తింటూ ఉండాలి. పండ్లు అనగానే.. మనకు వెంటనే గుర్తొచ్చేవి యాపిల్, దానిమ్మ, అరటిపండ్లు, జామకాయలు వంటివి. కానీ మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి. 


వాటిలో ఒకటి వాటర్ యాపిల్. దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండును మీరు చూసే ఉంటారు కానీ.. దానిపేరు వాటర్ యాపిల్ అని తెలిసి ఉండకపోవచ్చు. వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. పేరులోనే వాటర్ ఉంది కదా.. ఈ పండులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్ లో తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి.. ఇతర ఆహారాలు తినాలనే కోరిక ఉండదు. ఫలితంగా బరువు తగ్గుతారు.  వాటర్ యాపిల్ ను తింటే డీ హైడ్రేషన్ తగ్గుతుంది. ఇందులో గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్, ఐరన్, క్యాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును కూడా తగ్గిస్తుంది. మధుమేహం (షుగర్) ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ ను అనుమానం లేకుండా తినొచ్చు. ఇవి యాంటీ హైపెర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే బయోయాక్టివ్ స్పటికాకార ఆల్కలాయిడ్ జాంబోసిన్ కూడా ఉంటుంది. ఇది పిండి పదార్థాలను చక్కెరగా మార్చడాన్ని నిరోధిస్తుంది. వాటర్ యాపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది. తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వాటర్ యాపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ బి మెటబాలిజంను పెంపొదిస్తుంది.కాగా 100 గ్రాముల వాటర్ యాపిల్స్ లో 93 గ్రాముల నీరు, 0.6 గ్రాముల ప్రొటీన్, 5.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల డైటరీ ఫైబర్, కొవ్వు 0.3 గ్రాములు ఉంటాయి. అలాగే 3 శాతం క్యాల్షియం, 0.1 శాతం ఐరన్, 1 శాతం మెగ్నీషియం, 1 శాతం పాస్ఫరస్, 20 శాతం పొటాషియం, 1.5శాతం సల్ఫర్ ఉంటాయి.

Comments