సీజనల్ గా లభించే తాటికాయ లేదా తాటిపండులో ఆరోగ్యానికి మంచిచేసే పోషకాల గురించి తెలుసుకుందామా...

 తాటిపండ్లు.. ఇవి అందరికీ తెలిసినవే. కానీ అన్నిప్రాంతాల్లో దొరకవు. వేసవిలో వచ్చే ముంజులే.. వర్షాకాలం వచ్చేసరికి తాటికాయల్లా తయారవుతాయి. వీటిని నేలలో పాతిపెడితే తేగలుగా మారుతాయి. కాలానికి అనుగుణంగా.. తాటిచెట్టు నుంచి మనం మూడు రకాల ఆహారాలను పొందుతున్నాం. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలని చెప్పినా తక్కువే. 


నేచురల్ గా వచ్చే ఈ ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్ గా లభించే తాటికాయ లేదా తాటిపండులోనూ ఆరోగ్యానికి మంచిచేసే పోషకాలెన్నో ఉంటాయి. ఇప్పుడు అన్ని పండ్ల మాదిరిగానే.. వీటిని కూడా సిటీల్లో అమ్ముతున్నారు. పల్లెటూళ్లలో అయితే తాటిచెట్టు నుంచి తాటికాయ రాలడం ఆలస్యం.. దానిని ఇంటికి తెచ్చి.. కట్టెలపొయ్యిలో కాల్చి.. దానిలోని గుజ్జును తీసి పిల్లలకు పెడుతుంటారు. తాటిపండు గుజ్జులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలుంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని పోషకాల గని అని కూడా అంటారు. ఎదిగే పిల్లలకు తాటిపండును పెట్టడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. 

తాటికాయను పచ్చిగా తినకూడదు. అలా తింటే కడుపునొప్పి, మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కాల్చుకుని తింటేనే దాని రుచి తెలుస్తుంది. తాటిపండు గుజ్జుతో చాలారకాల వంటకాలు కూడా తయారు చేస్తారు. తాటిపండు నుంచి తీసిన గుజ్జుతో.. తాటి ఇడ్లీ, తాటి బూరెలు, తాటి రొట్టెలు వంటి వంటలు చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తాటి తాండ్రను కూడా తయారు చేసి అమ్ముతుంటారు. షుగర్ ఉన్నవారు కూడా తాటి పండును తినవచ్చు. టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నవారికి ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.తాటిపండు లేదా దాని గుజ్జుతో తయారు చేసిన ఆహారాలను తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి.. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. ఇన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలున్న తాటిపండు.. ఈ సీజన్ లోనే ఎక్కువగా దొరుకుతుంది. మీకు కనిపిస్తే మాత్రం.. దానిని తినడం అస్సలు మిస్ చేయకండి.

Comments