అతిమధురం వేరుతో అనేకరకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ...

 ఆయుర్వేదంలో వాడే వేర్లలో.. అతిమధురం వేర్లు కూడా ఒకటి. అనేక ఆయుర్వేద మందుల తయారీలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. అతిమధురం వేరుతో అనేకరకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అతిమధురం వేర్లు శాస్త్రీయ నామం గ్లైసరీసా గాబ్రా. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. 


తియ్యగా ఉంటుంది కాబట్టి దీనికి అతిమధురం అని పేరు. ఈ వేర్లను ఉపయోగించి దగ్గును తగ్గించుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యానికి, కడుపులో పుండ్లను తగ్గించుకునేందుకు కూడా వాడుతారు. ఇంకా అతిమధురంను ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో అతిమధురం చూర్ణాన్ని పాలు లేదా తేనెతో కలిపి తీసుకుంటే.. కడుపులో పుండ్లు తగ్గుతాయి. అతిమధురం వేర్లతో హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అర టీ స్పూన్ మోతాదులో పొడిని నీటిలో వేసి కలుపుకని తాగితే అల్సర్ సమస్య తగ్గుతుంది.అతిమధురం వేరు చూర్ణాన్ని వెన్న లేదా తేనె లేదా నెయ్యితో కలిపి కాలిన గాయాలపై రాస్తే.. అవి త్వరగా తగ్గుతాయి. 

రెండు గ్రాముల అతిమధురం వేరుపొడిని 3-5 గ్రాముల బెల్లంతో కలిపి ఉండలాగా చేసుకుని తింటే.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.అతిమధురం వేరు చూర్ణం అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని.. ఒక గ్లాసు నీటిని గిన్నెలో పోసి అందులో కలపాలి. ఈ నీరు అర గ్లాసు అయ్యేంతవరకూ మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని గోరువెచ్చగా ఉండగా తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇదే కషాయాన్ని నోటిలో పోసుకుని పుక్కిలించితే నోటిపూత తగ్గుతుంది. అతిమధురం వేర్లను పాలు, కుంకుమపువ్వుతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే కుంకుడుకాయ లేదా హెర్బల్ షాంపూతో తలంటుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టురాలడం, చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.అంతేకాకుండా మూత్రపిండాల సమస్య, రక్తపోటు (Blood Pressure), షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు అతిమధురం వేర్ల చూర్ణాన్ని వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Comments