ఇడ్లీ స్నాక్ : ఇడ్లీలు మిగిలితే పారేస్తున్నారా? ఇలా ట్రై చేసి స్నాక్ గా తినండి..టేస్ట్ సూపర్ అంతే!!

 ఇడ్లీ.. మనం రోజూ ఉదయం పూట తినే టిఫిన్స్ లో ఇది కూడా ఒకటి. ఇంటిల్లిపాది బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యాక.. ఒక్కోసారి ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఇంట్లో పనివాళ్లుంటే పెడతారు. లేదంటే అలానే ఉంచేసి.. ఏ సాయంత్రానికో పారేస్తారు.


 కానీ ఇకపై మిగిలిన ఇడ్లీలను అలా పారేయకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని స్నాక్స్ గా తింటే.. సూపర్ టేస్టీగా ఉంటాయి. క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో చూద్దామా.

క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు -6, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, ఎండుమిర్చి -7, పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు- 1 టేబుల్ స్పూన్, మినపప్పు – 1 టేబుల్ స్పూన్, బియ్యం – 1 టేబుల్ స్పూన్, మిరియాలు – 1/2 టీ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి – 1/2 స్పూన్, ఇంగువ- కొద్దిగా, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – రుచికి తగినంత.

తయారీ విధానం: ఒక పాత్రలో పైన పేర్కొన్న క్వాంటిటీ ప్రకారం.. ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, బియ్యం, మిరియాలు వేసి వేయించాలి. అవి వేగాక అందులోనే ఎండుకొబ్బరి పొడి, ఆమ్ చూర్ పొడి, ఇంగువ, కరివేపాకు వేసి లైట్ గా వేయించాలి. అవన్నీ చల్లారిన తర్వాత జార్ లో వేసి.. రుచికి తగినంత ఉప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి.. వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీల ముక్కలను వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని.. వేయించుకున్న ఇడ్లీలపై 2 టేబుల్ స్పూన్ల మోతాదులో చల్లి అంతా కలిసేలా చూసుకోవాలి. అంతే వేడి వేడి క్రిస్పీ ఇడ్లీ ఫ్రైస్ రెడీ. వీటిని పిల్లలు స్కూల్ నుంచి రాగానే సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

Comments