కీవీ పండు : ఆరోగ్యానికి మంచిదని కివీని అదేపనిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

 ఒకానొకప్పుడు పండ్లు అంటే.. ఆపిల్, ద్రాక్ష, మామిడి, జామకాయ, దానిమ్మ,కమలాలు, సీతాఫలం, అరటిపండ్లు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి చాలామందికి పేర్లుకూడా సరిగ్గా తెలియని పండ్లు వచ్చాయి. అలాంటివాటిలో కివీపండ్లు కూడా ఒకటి. రుచికి పుల్లగా ఉండే ఈ పండు తింటే ఆరోగ్యమే. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు కివీపండ్లలో ఉంటాయి.


 ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి. కంటిచూపు కూడా మెరుగవుతుంది. అంతేకాదు.. రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం అందంగా తయారవుతుంది. అంతాబాగానే ఉంది. మరి ఎందుకు ఎక్కువ తినకూడదు? అనే కదా మీ అనుమానం.ఏదైనా ఎక్కువైతే దానివల్ల అనర్థమే కదా. కివీ పండ్లను అధికంగా తింటే అలర్జీ బారిన పడే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై దురద, దద్దుర్లతోపాటు వాపులు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా ఓరల్ అలర్జిక్ సిండ్రోమ్ సమస్య రావొచ్చని హెచ్చరిస్తున్నారు. దానివల్ల నోటిలో దురద, నాలుక, పెదవులపై దురద రావడం, వాపు రావడం వంటివి జరుగుతాయట. 

వాంతులు, డయేరియా బారిన కూడా పడే అవకాశాలెక్కువ అని పేర్కొంటున్నారు. అలాగని అస్సలు తినకూడదని కాదు. కావలసిన మోతాదులో తీసుకుంటే చాలు. కాబట్టి ఇకపై కివీలను అధికంగా తీసుకోవడాన్ని తగ్గించుకుంటే అది మీ ఆరోగ్యానికే మేలు చేస్తుంది.

Comments