‘ప్రేమించి మోసం చేశాడు’.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదు


 పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని.. తీరా తనను వదిలేయాలంటూ బెదిరిస్తున్నాడని.. ఓ యువతి ట్రైనీ ఐఏఎస్‌పై ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు.. ట్రైనీ ఐఏఎస్‌ బానోత్‌ మృగేందర్‌లాల్‌పై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృగేందర్‌లాల్‌ ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు. ప్రస్తుతం ఆయన మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్నారు.ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో మృగేందర్‌లాల్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ప్రేమ పేరుతో తనకు దగ్గరైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఏకంగా ఎన్‌పీఏ రూమ్‌లో తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడని పేర్కొంది.

 ఇప్పుడు పెళ్లికి మృగేందర్‌లాల్‌ నిరాకరిస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తన కుమారుడిని వదిలేయాలని బెదిరిస్తున్నారని యువతి ఫిర్యాదులో తెలిపింది.తన కొడుకును వదిలేయాలంటూ మాజీ ఎమ్మెల్యే రూ.25లక్షలు డబ్బు కూడా ఇస్తామని ఆశచూపారని.. తన కొడుకును వదిలేయకపోతే చంపుతానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. కాగా.. గత నెల 27న కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదు కాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Comments