మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్


“ఆర్ ఎక్స్ 100” లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం “మహా సముద్రం”. శర్వానంద్-సిద్ధార్థ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఇవాళ (అక్టోబర్ 14) విడుదలయింది. హీరో సిద్ధార్ద్ కు ఇది టాలీవుడ్ రీఎంట్రీ అని చెప్పాలి. మరి ఈ సముద్రమంత ప్రేమ ప్రేక్షకులకు నచ్చిందో లేదో చూద్దాం..!!   కథ: బెస్ట్ ఫ్రెండ్స్ అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్ధ్). వైజాగ్ లో కలిసి పెరిగిన ఈ ఇద్దరి మనస్తత్వాలు వేరైనా.. స్నేహం మాత్రం విడదీయలేనిది. అర్జున్ తన మనసుకి నచ్చిన స్మిత (అను ఇమ్మాన్యూల్)ను, విజయ్ తాను ఇష్టపడిన మహా (అదితిరావు హైదరీ)లు ప్రేమిస్తుంటారు. అంతా బాగానే సాగుతుంది అనుకునే సమయానికి కారణాంతరాల వలన విజయ్ వైజాగ్ వదిలి వెళ్లాల్సి వస్తుంది. కట్ చేస్తే.. అప్పటివరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న అర్జున్ & విజయ్.. శత్రువుల్లా మారిపోతారు. అందుకు కారకులు చుంచు (జగపతిబాబు) & గూని బాబ్జి (రావు రమేష్). ఈ ఆరు పాత్రల కారణంగా ఎన్ని చీలికలు వచ్చాయి. చివరికి ఈ కథ ఏ తీరానికి చేరింది? అనేది “మహా సముద్రం” కథాంశం.

నటీనటుల పనితీరు: అందరూ సీనియర్ యాక్టర్లే. ఎవరి నటనకూ పేరు పెట్టాల్సిన పనిలేదు. అయితే.. విలన్లుగా నటించిన జగపతిబాబు, రావు రమేష్ లకు ఉన్న క్యారేటర్ ఎస్టాబ్లిష్మెంట్ లో సగం కూడా హీరోహీరోయిన్లకు లేకపోవడం గమనార్హం. సిద్ధార్ధ్ ను చాలా కాలం తర్వాత స్ట్రయిట్ తెలుగులో చూడడం సంతోషంగా ఉన్నప్పటికీ.. అతడి రీఎంట్రీ రేంజ్ క్యారెక్టర్ కాకపోవడం గమనార్హం. శర్వానంద్ పోషించిన క్యారెక్టర్ లో కొత్తదనం లేకపోయినప్పటికీ.. తన ఎనర్జీతో క్యారెక్టర్ ను సేవ్ చేసాడు. అదితిరావు, అను ఇమ్మాన్యూల్ పాత్రలతో క్రియేట్ చేయాలనుకున్న టెన్షన్ సినిమాలో ఆడియన్స్ ఫీల్ అవ్వలేదు. అందువల్ల పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: చేతన్ భరద్వాజ్ పాటలు వినసొంపుగా ఉన్నట్లుగా.. చూడముచ్చటగా లేవు. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అయితే.. కథనంలో పట్టు లేకపోవడంతో అతడి విజువల్స్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ప్రొడక్షన్ డిజైన్ కూడా పర్వాలేదు. కాస్ట్యూమ్స్ వర్క్ బాగుంది.ఇక దర్శకుడు అజయ్ భూపతి ఏం చెప్పాలనుకున్నాడో, ఏం తీసాడో సినిమా ఆఖరి నిమిషం చూస్తున్న ప్రేక్షకుడికి కూడా అర్ధం కాదు. క్యారెక్టరైజేషన్స్ పరంగా ఒక్క క్యారెక్టర్ కి కూడా క్లారిటీ కానీ డెప్త్ కానీ ఉండదు. తనకు దొరికిన అద్భుతమైన క్యాస్టింగ్ ను వేస్ట్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక కథనం పరంగా కనీస స్థాయి డెప్త్ లేకపోవడం, సెకండాఫ్ ను గాలికి వదిలేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. “ఆర్ ఎక్స్ 100” విజయంలో కీలకపాత్ర పోషించింది రావురమేష్ క్యారెక్టర్. తప్పు చేసిన కూతుర్ని తిట్టే సన్నివేశం యూత్ కి భీభత్సంగా కనెక్ట్ అయ్యింది. ఆ రేంజ్ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా సినిమాలో లేకపోవడం గమనార్హం. అలాగే.. “మహా” అనే పాత్ర చుట్టూ అల్లిన మెలికలు విప్పిన విధానం ఆకట్టుకునే విధంగా లేదు.

విశ్లేషణ: స్నేహితులు ఒక అమ్మాయి కారణంగా శత్రువుల్లా మారడం అనేది చాలా సాదాసీదా కథ. ఆ కథను కొత్తగా తెరకెక్కించే ప్రయత్నంలో తప్పు లేదు కానీ.. ఆ ప్రయత్నంలో నిజాయితీ లేకపోవడమే ఇక్కడ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది. “ఆర్ ఎక్స్ 100” డైరెక్టర్ నుండి వచ్చిన రెండో సినిమా కాబట్టి ఏదో ఉంటుంది అనే ఊహతో సినిమాకి వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లినా.. సోసోగానే ఉంటుంది. ఇకపోతే.. దర్శకుడు అజయ్ భూపతి సెకండ్ సినిమా సిండ్రోమ్ నుంచి తప్పించుకోలేకపోయాడమే చెప్పాలి.Comments