Sundarakanda Sarga 1-విరోధులను సంహరింప సమర్థుడగు హనుమంతుడు, రావణుడపహరించిన సీతాదేవి యున్న

అంతట (జాంబవంతుడు ప్రోత్సహించిన పిమ్మట) స్వకార్యము (సీతాన్వేషణము) నకు విరోధులను సంహరింప సమర్థుడగు హనుమంతుడు, రావణుడపహరించిన సీతాదేవి యున్న తావును, చారణులు (దేవగాయకులు) సంచరించు ఆకాశమార్గమున వెదుక దలంచెను అన్యుల కలవికాని సముద్రలంఘన మను కార్యమును ఎదురులేకుండునట్లు చేయ గోరినవాడై హనుమంతుడు మెడ చాచి, తల పైకెత్తి ఆబోతు వలె విరాజిల్లెను.

అంతట ధీరుడు, మహాబలుడగు హనుమంతుడు కొంచెం తెలుపు తో కూడిన వైడూర్యవర్ణము (ఆకుపచ్చ రంగు) కలవై, చల్లదనముచే నీటిని పోలుచున్న పచ్చికబయళ్లపై సుఖముగా (స్వేచ్ఛగా) సంచరించెను.

ధీమంతుడగు హనుమంతుడు విజృంభించిన సింహమువలె విహరించుచుండగా అతని రొమ్ము తాకి చెట్లు కూలెను. ఆ చెట్లపై ఉన్న పక్షులు బెదరెను. చాలా మృగములును (బెదరి) చెల్లాచెదరై నశించెను.

నల్లనివి, ఎఱ్ఱనివి, పసుపువన్నె కలవి, ఆకుపచ్చ రంగు కలవి, తెలుపు-నలుపుల మిశ్రవర్ణము కలవి, చిత్రవర్ణము కలవి అగు సహజసిద్ధమైన ధాతువులు హనుమ నిలచిన మహేంద్రగిరిని తమ కాంతులతో అలంకరించినవి

అచ్చట కామరూపులగు యక్షులు, కిన్నరులు, గంధర్వు లను దేవతలును, దేవ సమానులగు పన్నగులును అలంకరించుకొని ఎల్లెడల విహరించుచుండిరి.

శ్రేష్ఠములగు ఏనుగులు సంచరించు ఆ మహేంద్రపర్వతపు సుందరప్రదేశముపై నిలిచిన హనుమంతుడు మడుగులోని యేనుగువలె మిక్కిలి ప్రకాశించెను.

ఆయన తనకు విద్యాగురువగు సూర్యునకు, దేవరాజగు మహేంద్రునకు, వాయుదేవునికి, బ్రహ్మకు, భూతములు అను దేవతా విశేషములకును ప్రణమిల్లి అటనుండి బయలు దేరవలెనని సంకల్పించెను.

ఆయన తూర్పుదిశకు తిరిగి, తన తండ్రియగు వాయుదేవునకు మరొక్కమారు నమస్కరించి, పిమ్మట సమర్థుడగుటచే దక్షిణ దిశగా పోవుటకై తన శరీరమును పెంచెను.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

హనుమంతు డట్లు ఎగురుట నిశ్చయించి, రాముని అభ్యుదయమును కోరుచు, కపిశ్రేష్ఠులు చూచుచుండగనే పున్నమి వంటి పర్వదినములందు సముద్రము పొంగునట్లు పెరిగెను.

అతడు సముద్రమును దాటగోరుచు, తన దేహమును కొలువరానంతగా పెంచి, చేతులతో, కాళ్ళతో ఆ పర్వతమును గట్టిగా తొక్కిపట్టెను

ఆ మహేంద్ర పర్వతం అచలము (కదలనిది) అయినా, హనుమంతుడు మర్దింపగా ఆ ఒక్కక్షణము చలించెను. ఆ కదలికకు కొండపై నున్న చెట్ల కొమ్మల కొనలవరకు విరబూసిన పూవు లన్నియు రాలిపడెను.

ఆ చెట్లు సుగంధము కల పుష్పరాశులను రాల్చి శిలాతలమును అన్నివైపుల నుండి కప్పివేయగా ఆ కొండ పూలకొండవలె ప్రకాశించెను.


మెచ్చదగిన పరాక్రమము గల హనుమంతుడు మర్దించగా ఆ మహేంద్రపర్వతము మదించిన యేనుగు మదజలము కార్చినట్లు, మిక్కుటముగా జలము కార్చెను.

బలశాలియగు హనుమంతు డట్లు పీడింపగా, ఆ పర్వతమునందలి బంగారు, నీలము, వెండి ఖనిజ రాళ్ళు బ్రద్దలై ఆ యా లోహముల రేఖ లగపడెను.
మండుచున్న అగ్ని తన ఏడు జ్వాలలలో నాల్గవదగు ధూమ్రవర్ణ యను నడిమి జ్వాలతో కూడి పొగలు గ్రక్కిన ట్లా మహేంద్రపర్వతము మణిశిలలతో గూడిన పెనురాలను విరజిమ్మెను.
హనుమంతు డట్లు మహేంద్రపర్వతమును మర్థించుచుండగా దిగులుపడి, అంతటను గుహలలో దాగిన జంతువులు దీనస్వరముతో బిగ్గరగా అరచెను.
మారుతి అట్లా కొండను మర్దించుటచే అందు నివసించిన పెద్ద పెద్ద జీవులు చేసిన ఆక్రందనధ్వని భూమిని, దిక్కులను, వనములను దద్దరిల్ల జేసెను.
అట్టి మర్దనముచే తమ విపులములగు పడగల పై అర్ధచంద్రాకారపు చిహ్నములు స్పష్టముగ అగపడగా, నోటినుండి భయంకరమగు అగ్ని వంటి విషము గ్రక్కుచు సర్పములు కోరలతో రాలను కరచినవి.
కోపించిన విషసర్పములు పెద్ద రాళ్ళను కరవగా అవి విషాగ్నిచే ప్రజ్వలించి, వేలకొలదిగా ముక్కలయ్యెను.
ఆ కొండపై మొలచిన ఓషధు లేవియును, విషము హరింపగలపైనను, ఆ సర్పముల విషమును పోగొట్టజాలవయ్యొను.
ఈ కొండను భూతము లేవో బ్రద్దలు చేయుచున్నవని తలచి తపస్వులు అచటనుండి ఆకసమున కెగసిరి.
తమ స్త్రీలతో కలిసి మద్యం త్రాగుచు, మధురభక్ష్యములు తినుచున్న విద్యాధరులు పానభూమిపై గల బంగారు సారాయిగిన్నెను, విలువైన భోజన పాత్రలను, బంగారు కమండలములను, నాకదగిన పూదేనె మున్నగువానిని, ఆస్వాదింపదగిన వివిధ భక్ష్యములను పలురకముల మాంసములను, ఎద్దుతోలుతో చేయబడిన డాళ్లు, బంగారు పిడుల కత్తులను విడచి, తమ స్త్రీలతో గూడి భీతితో ఆకసమున కెగసిరి.
మెడలలో పుష్పమాలలు దాల్చి, మత్తులై, ఎర్రనైన మాలలు శిరమున ధరించి, ఎర్ర చందనము దేహమున కలదికొని, సహజముగ పద్మములవంటివైనను మద్యపానముచే ఎర్రబారిన కన్నులు గల విద్యాధరు లాకాశమున కెగిరిపోయిరి.
ముత్యాలసరులు, అందెలు, భుజకీర్తులు, కంకణములు ధరించి రాజిల్లు విద్యాధరాంగనలు ఆ పర్వత మట్లు కదలుటకు ఆశ్చర్యపడి, తమ రమణులను కూడి చిరునగవు లొలికించుచు ఆకసమున నిలిచిరి.
విద్యాధరశ్రేష్ఠులు అణిమాది అష్టమహాసిద్ధిరూపమగు తమ మహాశక్తిని ప్రయోగించి ఆకసమున నొక్కచోట నిలచి ఆ పర్వతము నవలోకించిరి.
వా రపుడు నిర్మలాకాశమున నిలచిన పరమాత్మనిష్ఠులగు మునులు, చారణులు, సిద్ధులు పలికిన ఈ వాక్యములు వినిరి.
పర్వతం వలె పెద్ద శరీరంతో విలసిల్లు వాయుపుత్రుడగు ఈ హనుమంతుడు మహా వేగంతో మొసళ్ళకు నెలవగు సముద్రమును దాటగోరుచున్నాడు.
రామునికొరకు, రామకార్యసాధనోద్యుక్తులగు వానరులకొరకును కష్టసాధ్యమగు కార్యము సాధింపగోరుచు, ఇతరులకు దాటశక్యముగాని సముద్రపు టవ్వలియొడ్డు నితడు చేరగోరుచున్నాడు”.

Comments