Sundarakanda Sarga 1 Part;-9 - నీతో ముల్లోకములలో ప్రసిద్ధమగు ఇచ్చి పుచ్చుకొను సంబంధము లేకపోలేదు

Sundarakanda Sarga;-ఆ మైనాకుడు వెంటనే మనుష్యరూపము ధరించి ఆకాశమున పోవు వీరుడగు హనుమంతునకు చేరువనే తన శిఖరముపై నిలచి, పులకితాంతరంగుడై ప్రీతితో నతని కిట్లనెను

వానర శ్రేష్ఠుడా! నీవు అన్యుల కలవిగాని ఈ గొప్పపని చేసితివి. కావున నా శిఖరములపై దిగి, సేద తీరువఱకు విశ్రమింపుము.


ఈ సాగరుడు రాముని పూర్వులచే పెంపొందింపబడినాడు. కావున రాముని హితము కోరి పోవుచున్న నిన్నాదరించుచున్నాడు.

తన కుపకరించిన వానికి ప్రత్యుపకారము చేయవలయును. ఇది సనాతన ధర్మము. కావున నీ వాతిథ్యము స్వీకరింపవలెనని కోరుచున్న సముద్రుని కోర్కెను తీర్చి యతనిని సత్కరింపదగుదువు.

“ఓ మైనాకుడా! ఈ హనుమంతుడు నూరు యోజనముల దూరము ఎగుర నుద్యమించినాడు. నడుమ నీ సానువులం దొకింత విశ్రమించి తక్కిన దూరము దాటగలడు” అని యిట్లు నీ కాతిథ్య మిచ్చుటకై సముద్రుడే నన్ను సగౌరవముగ ప్రోత్సహించినాడు. కావున ఓ కపిశ్రేష్ఠుడా! నాపై యొకింత విశ్రమించి పొమ్ము.

వానరశ్రేష్ఠుడవగు ఓ హనుమంతుడా! మంచి రుచి, వాసనగల ఈ కందమూలములను, పండ్లను తిని, కొంత తడవు విశ్రమించి, నీ వటుపై మఱల పోవచ్చును.

ఓ వానరముఖ్యుడా! మాకును, నీతో ముల్లోకములలో ప్రసిద్ధమగు ఇచ్చి పుచ్చుకొను సంబంధము లేకపోలేదు. ఇది సజ్జనసమ్మతమైన ఆతిథ్యరూపమగు ధర్మము.

వాయు తనయుడ వగు కపిశ్రేష్ఠుడా! మహావేగము, ఎగురుటలో కౌశలము గల వానరులలో నిన్ను ప్రధాని తలంతును.

ధర్మాచరణమున శ్రద్ధగల పండితునకు అతిథి సామాన్యుడైనను పూజనీయుడు. అట్టిచో వంటి మహాత్ము డతిథియైనచో మా బోంట్లకు పూజనీయుడు కాకుండునా?

ఓ వానర శ్రేష్ఠుడా! నీవు దేవశ్రేష్ఠుడు, మహాత్ముడగు వాయు దేవుని కుమారుడవు. వేగమున నీ వతనికి సాటియైన వాడవు.

ధర్మ మెఱిగినవాడా! నిన్ను పూజింతునేని నా తండ్రి వాయుదేవుని పూజించినట్లగును. కావున నీవు నాకు పూజనీయుడవు. నేను నీ తండ్రిని పూజింపవలయును. అందులకు కారణము చెప్పెదను వినుము.

నాయనా! పూర్వము కృతయుగమున పర్వతములకు ఱెక్కలు ఉండెడివి. అందువలన అవి గరుత్మంతునివలె, వాయువువలె వేగముగ అన్ని దిక్కులకు పోవుచుండెడివి.

పర్వతము లట్లు ఎగురుచుండగా దేవతలు, ఋషులు, సకలజీవరాశులును, ఆ పర్వతములు తమపై పడునేమో యను శంకతో భయపడినవి.

అంత నూఱుయాగముల నొనర్చి శతక్రతుడని ప్రసిద్ధుడైన దేవేంద్రుడు పర్వతములపై కోపించెను. తాను సహస్రాక్షుడు (వేయి కన్నులు కలవాడు) అగుటచే ఆయన వెదకి వెదకి ఎచట దొరికిన అచటనే ఆ పర్వతాల రెక్కలు వజ్రాయుధంతో నఱికివైచెను.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments