Sundarakanda Sarga 1 Part;-8 - కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఎల్లరకు భయము గొల్పు గొప్పపనులు నిర్వహింప

Sundarakanda Sarga ;-కావున ఈ హనుమంతుడు నడుమ విశ్రమించునట్లు చేయుట నాకు కర్తవ్యము. అట్లు నా వద్ద విశ్రమించి, తక్కిన మార్గము నవలీలగ హనుమ దాటగలడు

సముద్రు డిట్లు ఉత్తమమగు ఆలోచన చేసి, తన జలములలో దాగియున్న బంగారు శిఖరాలు గల పర్వతశ్రేష్ఠుడు మైనాకుని చూచి యిట్లనెను.


ఓ పర్వతశ్రేష్ఠుడా! దేవేంద్రుడు పాతాళలోకమున నున్న రాక్షసులు భూమిపైకి రాకుండునట్లు ఇనుపగడియవలె నిన్నడ్డముగా నుంచినాడు.

బలము కూడగట్టుకొని, మఱల భూమిపైకి రాబోవు ఈ రాక్షసులను నివారించుచు నీవు మిగుల విస్తృతమగు పాతాళలోకపు ద్వారమును కప్పివైచి నిలిచియున్నావు.

ఓ పర్వతశ్రేష్ఠుడా! నీవు అడ్డముగను, పైకి, క్రిందకు గూడ పెరుగగలవాడవు. కావున నిన్నే ప్రేరణ చేయుచున్నాను. నీ వింక లెమ్ము
ఈ కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఎల్లరకు భయము గొల్పు గొప్పపనులు నిర్వహింప జాలినవాడు. పరాక్రమశాలి. సీతాన్వేషణ మను రామకార్యము సాధించుటకు నీమీదుగా ఆకాశమార్గమున పోవుచున్నాడు.
ఇక్ష్వాకువంశ్యుడగు రాముని సేవించు ఈ హనుమంతుని నేను సహాయము చేయవలయును. నాకు ఇక్ష్వాకువంశ్యులు పూజనీయులు. నీకు మిక్కిలి పూజనీయులు.
మా పని మించిపోకముందే నీవు మాకు సహాయపడుము. చేయవలసిన పని చేయనిచో సత్పురుషులు కోపింతురు.

కపిశ్రేష్ఠుడగు ఈ హనుమ మన కతిథి, పూజనీయుడును. కాన నీవు నీటినుండి పైకి రమ్ము. ఇతనిని నీ శిఖరములపై విశ్రమింపనిమ్ము.


బంగారు శిఖరములు గలవాడవు, దేవతలచే, గంధర్వులచే గూడ సేవింప బడువాడవగు మైనాకుడా! హనుమంతుడు నీపై విశ్రమించి తక్కిన మార్గమును సుఖముగ దాటగలడు.
రామచంద్రునికి సీతపై గల మిక్కిలి దయను, సీతాదేవి పరదేశనివాసమును, హనుమంతుని శ్రమమును ఆలోచించియైన నీవిక లెమ్ము.
బంగారు శిఖరములు గల మైనాకుడు సముద్రుని మాటలు విని పెద్ద చెట్లు, తీగలతో కూడి శీఘ్రమే సముద్రజలమునుండి పైకి వచ్చెను

ప్రకాశమానములగు కిరణములు గల సూర్యుడు మబ్బును చీల్చుకొని వెలువడినట్లు మైనాకుడు సముద్రజలమును చీల్చుకొని అప్పుడే పైకి వచ్చెను.

సముద్రు డట్లు మహాత్ముడగు మైనాకుని ప్రేరింపగా అతడొక్కక్షణములో జలము కార్చుచు పైకి వచ్చి తన శిఖరములను ప్రదర్శించెను.
కిన్నరులు ఉరగుల కావాసమై ఆకాశము నంటుచున్నట్లున్న తన బంగారు శిఖరములతో సూర్యోదయమువలె ప్రకాశించుచు, మైనాకుడు పైకి వచ్చెను.
అట్లు మేలిమి బంగారముతో నిండిన మైనాకుని శిఖరములు సముద్రము నుండి పైపైకి పెరుగగా, వాని కాంతిచే, కత్తివలె నల్లనగు ఆకాశము బంగారు వన్నె గల దయ్యెను.
అట్లు బంగారం తో నిండిన వగుటచే స్వప్రకాశముచేతనే వెలుగొందు శిఖరములు గల మైనాకపర్వతము నూఱ్గురు సూర్యులకు సాటిగా నుండెను.
ఆ విధముగ సముద్రము నుండి పైకి లేచి, తన యెదుట నిలచిన పర్వతమును హనుమంతుడు తన ప్రయాణము నడుమ కలిగిన విఘ్నముగా తలంచెను.
మహావేగము గల ఆ హనుమ, అధికముగ పైపైకి పెరిగిన ఆ పర్వతమును, గాలి మబ్బును చెదరగొట్టునట్లు తన ఱొమ్ము తాకుతో అనాయాసముగ పడవైచెను.
అట్లు హనుమంతుడు పడగొట్టగా, శ్రేష్ఠమగు మైనాకపర్వతము అతని వేగము నెఱిగి పులకించి ఆనందించెను.

Comments