Sundarakanda Sarga 1 Part;-6 - మహోన్నతము లైన సముద్రతరంగములను దాటిపోవుచు, వానిని లెక్కించుచు

Sundharakhanda;- మిక్కిలి బలముగల హనుమంతుని గమనవేగముచే వెడలిన వాయువు, మేఘముల వల్ల ఏర్పడిన గాలియును, భయంకరముగ గర్జించు సముద్రమును సైతము మిక్కిలి కలవరపరచెను.వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు తన వేగముతో సముద్రమునందలి అలలను లాగుచు, వానిని భూమ్యాకాశముల నడుమ వెదజల్లుచున్నట్లు ఆకాశమున ఎగిరెను.

మహావేగముగల హనుమంతుడు మేరు, మందర పర్వతముల వలె మహోన్నతము లైన సముద్రతరంగములను దాటిపోవుచు, వానిని లెక్కించుచు పోవుచుండెనో యన్నట్లుండెను.

హనుమంతుని వేగముచే పై కెగసిన నీరు, మేఘములతో కూడి తెల్లనై, ఆకాశమున వ్యాపించిన శరత్కాలమేఘమువలె కనుపించెను.

వస్త్రము తొలగింపగా మనుజుల అవయవము లగపడునట్లు, నీరు పై కెగయుటచే సముద్రమందలి పెను చేపలు, మొసళ్ళు, పిల్ల చేపలు, తాబేళ్లు కనుపించెను.

అపుడు సముద్రమున నివసించు సర్పము లాకసమున మహావేగముతో ఎగురుచున్న హనుమంతుడు చూసి గరుత్మంతుడని తలంచినవి.

ఆ కపిశ్రేష్ఠుని నీడ పదియోజనముల వెడల్పు, ముప్పది యోజనముల పొడవు కలిగి సముద్రపు నీటిలో మిక్కిలి సుందరముగ కనుపించెను.

హనుమ వెంట పోవుచున్న ఆ నీడ సముద్రమున వ్యాపించి తెల్లని మేఘముల దట్టమగు వరుసవలె ప్రకాశించెను.

మహాతేజస్వి, మహాశరీరధారి యగు హనుమంతుడు నిరాధారమగు ఆకాశమున రెక్కలుగల పర్వతమువలె ప్రకాశించెను.

బలవంతుడగు హనుమంతు డే మార్గమున వేగముగ పోవుచుండెనో ఆ మార్గమం దంతటను అతని గమనవేగముచే జల మడుగంటగా అపు డచట సముద్ర మొక్కమారుగా పెద్ద దొన్నె వలె కనిపించెను.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments