Sundarakanda Sarga 1 part-5 - మహాబుద్ధిశాలి యగు హనుమంతుడు, తన చుట్టును చక్రాకారముగ

 Sundarakhanda;-ఎర్రని ముక్కు చే ఎర్రబారిన హనుమంతుని ముఖము, సంధ్యారాగముతో కూడిన సూర్యమండలమువలె ప్రకాశించెను.

హనుమంతుడు ఆకసమున ఎగురుచు తోకను పైకెత్తగా, అది యెత్తైన ఇంద్రధ్వజము (ఇంద్రుని ప్రీతికై చేయు ఉత్సవాదులలో ఉత్సవ సూచకంగా ఎగురవేయు జెండా) వలె శోభిల్లెను.


తెల్లని కోరలు కలవాడు, మహాబుద్ధిశాలి యగు హనుమంతుడు, తన చుట్టును చక్రాకారముగ నున్న తోకచే పరిధి (గూడు)తో కూడిన సూర్యుని వలె భాసిల్లెను.

మిక్కిలి ఎర్రనైన వాలమూలప్రదేశము (తోక ప్రారంభమగు చోటు)తో కూడిన హనుమ చీల్చబడిన పెద్ద గైరికధాతువుతో కూడిన కొండవలె శోభిల్లెను.

అట్లు పైనుండి సముద్రం దాటుతున్న వానరశ్రేష్ఠుడగు హనుమంతుని బాహుమూల (చంక) ప్రదేశమునుండి వెడలిన వాయువు మేఘమువలె గర్జింప సాగెను.

ఆకాశమున ఉత్తర దిక్కు నుండి బయలుదేరిన ఉల్క, తోకతో కూడి ఎడతెగక యెట్లగపడునో అట్లే ఆ కపిశ్రేష్ఠుడును అగపడెను.
ఆకాశముపై పోవుచున్న సూర్యునివలె నున్న విశాలకాయుడగు హనుమంతుడు, స్తంభమునకు కట్టివేయుటచే నిడివిగా సాగుచున్న యేనుగువలె శోభిల్లెను.
అతడు సముద్రం పై అగపడు శరీరముతోను, క్రింద నీటిలో కానవచ్చు తన ప్రతిబింబముతోను, పైన తెరచాప మున్నగునవి కలిగి, క్రిందిభాగము నీటిలో నున్నదై గాలి వాలుచే పోవుచున్న ఓడవలె నుండెను.

మహాకపి యగు హనుమంతుడు సముద్రముపై ఏ యే ప్రదేశమున సంచరించెనో ఆ యా సముద్రభాగమున ఎత్తైన తరంగాలు లేచుటచే, అది అపస్మారము కలది వలె (భ్రమణము, నురుగులతో నీరు కక్కుట, పెద్దగా ధ్వని చేయుట మున్నగు లక్షణములతో) కనిపించెను.
మహావానరుడగు ఆ హనుమంతుడు పర్వతాకారముతో ఎగసిపడుచున్న అలలను తన రొమ్ముతో ఎదుర్కొనుచు, మహావేగంతో సముద్రంపై ఎగిరెను.

Comments