Sundarakanda Sarga 1 part-2- కొండపై నున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతుని చూచిరి.

 విద్యాధరు లా మహాత్ములగు ఋషులు మున్నగువారి పై వాక్యములు విని అట్లు అంతులేని పెనురూపు దాల్చి కొండపై నున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతుని చూచిరి.పర్వతమువలె పెద్ద శరీరము దాల్చిన హనుమంతుడు తన మేని వెండ్రుకలను ఉత్సాహముతో విదల్చెను. శరీరమును కంపింపజేసెను. పెనుమబ్బు వలె గర్జించెను.
అతడు ఆకాశమున ఎగురబోవుచు గుండ్రముగా వెండ్రుకలతో చుట్టచుట్టుకొని పైన లావుగా నుండి క్రమముగా సన్నబడిన తన తోకను గరుత్మంతుడు సర్పమును విదిలించునట్లు విదిల్చెను.
హనుమంతుడు వేగము పెంచగా అతని వెనుకనున్న తోక గరుత్మంతుడు పట్టి తీసికొనిపోవుచున్న మహాసర్పమువలె నుండెను.
ఆ హనుమంతుడు గొప్ప యినుపగుదియల వలె నున్న తన భుజములను కొండపై గట్టిగా నొక్కిపట్టి, నడుము సన్నము చేసికొని, కాళ్ళను కుంచింపజేసికొనెను.
శ్రీమంతుడు, మహాబలుడగు హనుమంతుడు తన బాహువులను, మెడను సంకోచింపజేసి, తనలో సహజముగనే గూఢముగ నున్న తేజస్సును, సత్త్వమును, వీర్యమును, పైకి తెచ్చుకొనెను.
అతడు తన చూపును పైకి ప్రసరింపజేసి దూరమునుండియే తాను పోవలసిన మార్గము నాలోకించుచు, ఉచ్ఛ్వాసనిశ్వాసములను హృదయముననే బిగబట్టెను.
మహాబలుడు, కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు పాదములతో కొండ నదిమిపెట్టి, చెవులు ముడుచుకొని, ఎగురబోవుచు వానరులతో ఇట్లనెను.
రాముడు విడచిన బాణం మెట్లు వాయువేగముతో పోవునో, నేనును అట్లే రావణుడు పాలించు లంకాపురి కేగెదను.
సీతాదేవి లంకలో కనబడనిచో, ఇదే వేగంతో దేవలోకమున కేగెదను.

Comments