Sundarakanda Sarga 1 Part;-12 - న్నతిక్రమించి యెవ్వడును పోజాలడు. నా కట్టి వరమున్నది

 Sundarakanda Sarga 1;-అట్లు కాదేని, సీతాదేవిని చూచి, పిమ్మట అవలీలగా కార్యములు సాధించు రాముని దర్శించి వచ్చి నీ నోట పడెదను. నా మాట నిజము. నీ కిదే ప్రతిజ్ఞ చేయుచున్నాను.

అని యిట్లు హనుమ పలుకగా కామరూపిణియగు ఆ సురస “ఓయీ! నన్నతిక్రమించి యెవ్వడును పోజాలడు. నా కట్టి వరమున్నది” అనెను.


వీని భావమిది: నాగమాత సురస, ఆకాశమున పోవుచున్న హనుమంతుని చూచి, అతని బలమెట్టిదో తెలిసికొన దలచి అతనితో “ఓ వానరోత్తమా! నీవిపుడు నా నోట ప్రవేశించియే పోవలెను. నాకిది వెనుక బ్రహ్మ యిచ్చిన వరము” అని పలికి శీఘ్రమే తన విశాలమగు నోరు తెఱచి హనుమంతుని యెదుట నిలచెను. సురస మాటలు విని హనుమంతుడు కోపించి “నీవు నన్ను మ్రింగ కోరితివి గదా. దానికి తగినట్లు నీ నోరు తెఱచి చూపు” మని పలికి పది యోజనములు పెరిగెను. అట్లు పదియోజనములు పెరిగి మేఘమువలె నున్న హనుమాన్ చూచి సురస తన నోటి నిరువది యోజనాలు విస్తరింప జేసెను. దానిని చూచి కోపించిన హనుమ ముప్పది యోజనములు పెరిగెను. అంత సురస తన నోటిని నలుబది యోజనములు పెంచెను. అంత హనుమంతుడు ఏబది యోజనములు శరీరము పెంచెను. సురస అరువది యోజనములు నోరు పెంచెను. వీరుడగు హనుమంతుడు డెబ్బది యోజనములు శరీరము పెంచెను. సురస తన నోటిని ఎనుబది యోజనములు విస్తరింపజేసెను. కొండవలె నున్న హనుమంతుడు తన శరీరాన్ని తొంబది యోజనములు పెంచెను. సురస తన నోటిని నూరు యోజనములు పెంచెను.

బుద్ధిమంతుడగు హనుమంతు డట్లు తెఱచిన ఆమె నోటిని చూచి, తన శరీరమును మిక్కిలి తగ్గించుకొని బొటనవ్రేలి పరిమాణము కలవాడయ్యెను.

మహావేగము గల హనుమంతుడు శీఘ్రమే యామె నోట ప్రవేశించి, బయటకువచ్చి, ఆకాశమున నిలచి ఉత్సాహముతో ప్రకాశమానుడై యిట్లనెను.

ఓ దాక్షాయణీ! నీ కిదే నమస్కారము. నేను నీ నోట ప్రవేశించి వెలువడుటచే బ్రహ్మావర మిపుడు సత్యమయ్యెను కదా. నే నిపుడు సీతమ్మ కడ కేగెదను.

అంతట సురస తన సహజరూపము దాల్చి, రాహువు నోటినుండి వెలికి వచ్చిన చంద్రునివలె తన నోటినుండి వెలువడిన హనుమంతునితో యిట్లనెను.

‘ఋజు ప్రవర్తన గల ఓ కపిశ్రేష్ఠుడా! నీ వింక సుఖముగ పోయి రమ్ము. సీతాదేవిని మహాత్ముడగు రాముని కొడుకు చేర్చుము

మిక్కిలి దుష్కరమగు హనుమంతుని యా మూడవ కార్యమును చూచి భూతములు బాగు బాగని అతనిని ప్రశంసించినవి.

వేగమున గరుడునకు సాటియగు హనుమంతుడును ఆకాశమార్గము జేరి ఎదిరింపరాని ఆ సముద్రముపై యెప్పటివలె వెడలిపోయెను.

అతడు, మేఘములు కురిపించు వర్షధారలతో కూడినది, పక్షులు సంచరించునది, కైశికరాగ మాలపించు విద్యాధరులు విహరించునది, ఇంద్రధనుస్సు తో కూడినది, (లేదా ఐరావతము ఇంద్రుని ఏనుగు విహరించునది), సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు లాగుచుండగా వేగముగ పోవు సుందర విమానాలు కలది, వజ్రము, పిడుగులు ఢీకొన్నట్లు అగ్నులు (తేజోవంతములగు నక్షత్రములు) ఢీకొనుట వల్ల ఏర్పడిన వెలుగులు కలది, పుణ్యము చేసి, స్వర్గమును సాధించిన మహాత్ములతో శోభిల్లునది, తక్కిన దేవతలకు హవిస్సును చేర్చుటకు అగ్నిదేవుడు తిరుగాడునది, గ్రహాలు, అశ్విన్యాదిసప్తవింశతి (27) ప్రసిద్ధ నక్షత్రాలు, సూర్యచంద్రులు, తక్కిన నక్షత్రములు ప్రకాశించునది, మహామునులు, గంధర్వులు, నాగులు యక్షులు అంతటను కలది, వ్యాపనశీలమైనది అగుటచే జనసమ్మర్దం లేక నిర్మలమైనది, విశ్వావసు వను గంధర్వరాజు విహరించునది, దేవేంద్రుని ఐరావత మను యేనుగు తిరుగాడునది, చంద్రసూర్యులు పయనించు మార్గమైనది, శుభకరమైనది, విస్తృతమై జీవుల కెల్లరికి పైభాగమున బ్రహ్మచే నిర్మితమైన చాందినీ అయినది, వీరులు, శ్రేష్ఠులగు విద్యాధరుల కాటపట్టయినది అగు వాయుమార్గమున గరుత్మంతునివలె పోయెను.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments