Sundarakanda Sarga 1 Part;-11 - హనుమ సుదూరప్రయాణముచే గూడ అలసిపోక సముద్రంపై ఎగురుచున్నాడు

Sundarakhanada Sarga ;-హనుమంతు డాకాశమార్గమున నూరు యోజనముల దూరము దాటి పోవుచుండగా అతని కేమగునో యని మే మెల్లరము భయపడితిమి. అట్టి సందర్భమున కూడ భయపడని హనుమకు నీవు చాల సహాయము చేసితివి. ఈ హనుమ దశరథమహారాజు కుమారుడగు రాముని పనుపున దూతగా పోవుచున్నాడు. నీ వతనికి చేసిన సత్కారము నన్నెంతో సంతోషింపజేసినది.దేవరాజగు ఇంద్రు డట్లు సంతసించుట చూచి పర్వతశ్రేష్ఠుడు మైనాకుడు మిక్కిలి ఆనందించెను.
మైనాకు డట్లు దేవేంద్రునిచే నభయము పొంది, (హనుమంతుడు మఱలి వచ్చుటను ప్రతీక్షించుచు నీటిలో మునుగక) యట్లే నిలిచి యుండెను. హనుమంతుడు ముహూర్త కాలములో ఆ (సముద్ర) ప్రదేశమును గడచి ముందుకు పోయెను.
అంత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యుని వలె ప్రకాశించు నాగమాత యగు సురస యను నామె కిట్లనిరి.
వాయుపుత్రుడగు ఈ హనుమ సుదూరప్రయాణముచే గూడ అలసిపోక సముద్రంపై ఎగురుచున్నాడు. నీవు పెనుకోరలతో, గోరోచనపు వన్నెగల కన్నులతో భయంకరమైన పర్వతమువలె విశాలమగు రాక్షసరూపము దాల్చి, నోటి నాకాశమువలె విపుల మొనర్చి హనుమంతుని గమనమునకు ముహూర్తకాలము విఘ్నము కలిగించుము.
మేము హనుమంతుని బలమును, శత్రువులను జయింపజాలిన అతని పరాక్రమమును తెలియగోరుచున్నాము. అతడు నిన్ను ఉపాయముతో జయించునో లేక భీతిల్లి విషాదము నొందునో చూచెదము.
అని దేవత లట్లు తన్ను కోరి సత్కరించగా ఆ సురసాదేవి సముద్రమధ్యమున అసహజము, వికృతము, ఎల్లరకు భయంకరము అగు రాక్షసరూపము దాల్చి ఎగురుచున్న హనుమంతుని మార్గమునకు అడ్డు నిలచి యిట్లనెను.
ఓ వానర శ్రేష్ఠుడా! దేవతలు నిన్ను నా కాహారము నిర్దేశించారు. నే నిదే నిన్ను భక్షింతును. నీవు నా నోట ప్రవేశింపుము.
ఓ వానర శ్రేష్ఠుడా! దేవతలు నిన్ను నా కాహారము నిర్దేశించారు. నే నిదే నిన్ను భక్షింతును. నీవు నా నోట ప్రవేశింపుము.
దశరథ మహారాజు తనయుడగు రాముడు తమ్ముడగు లక్ష్మణునితోడను, భార్య సీతతోడను దండకారణ్యమున ప్రవేశించినాడు.
శూర్పణఖ ముక్కు, చెవులు కోయుట మున్నగు పనులచే రాక్షసులతో శత్రుత్వమును పొందిన రాముడు మాయామృగమును పట్టుటకై పోగా, అతని భార్య, యశస్విని యగు సీతను రావణుడు అపహరించినాడు.
నేను రామునాజ్ఞ తల దాల్చి దూతనై సీతాదేవి కడ కేగెదను. నీవు రాముని రాజ్యమందున్నదానవు. కావున రామునకు సహాయం చేయదగుదువు.

Comments