మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు

 వాయుదేవుని వరప్రసాదంగా కుంతీదేవికి భీముడు జన్మించాడు. మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వాడు. భీముడు అన్యాయాన్ని అసలు సహించడు. మరి మహాభారతంలో భీముడి గొప్పతనం ఏంటనే కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఏకచక్రపురంలో పాండవులు చేరిన బ్రాహ్మణుడి ఇంట్లో వచ్చిన సంకటాన్ని భీముడే తీర్చాడు. బకాసురుడికి తీసుకెళ్లే బండెడాహారాన్నీ తానే తిని, ఆ రాక్షసుణ్ని మట్టిబెడ్డలాగ నలిపేశాడు భీముడు. రాజ సూయ యాగం చేయడానికి దిక్కులన్నీ జయించాలి.
భీముడు తూర్పువైపు రాజుల్ని జయించుకొని వచ్చాడు. దానికి ముందు, జరాసంధుణ్ని సంహరించడం అవసరమని శ్రీకృష్ణుడూ అర్జునుడూ భీముడూ యాచకుల వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ భీముడు జరాసంధుణ్ని గదాయుద్ధంతోనూ చివరికి కుస్తీతోనూ చంపాడు. మయసభలో నేలనుకొని నీళ్లలో చతికిలబడ్డ దుర్యోధనుణ్ని చూసి భీముడు నవ్వేసరికి దుర్యోధనుడి గుండె మండిపోయింది. శకుని పాచికల బలాన్ని చూసుకొని, తండ్రి ధృతరాష్ట్రుణ్ని ఒప్పించి, పాండవుల్ని జూదమాడడానికి పిలిపించాడు.
తొలిజూదంలో అందరూ దాసులైపోయారు. భీముడు, తమను ఓడినందుక్కాదు గానీ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని చూసి అన్నగార్ని తప్పుపట్టాడు. ఆ కోపంతో సహదేవుడితో ‘తమ్ముడూ! నిప్పు పట్టుకొనిరా! ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను’ అంటూ మండిపడ్డాడు. కొప్పుపట్టుకొని ద్రౌపదిని దుశ్శాసనుడు జూదసభలోకి ఈడ్చుకొని రావడాన్ని చూసి భీముడు ‘ఈ పాపిష్ఠి దుశ్శాసనుడి రొమ్మును బలవంతంగా చీల్చి వాడి వేడి వేడి రక్తాన్ని తాగుతాను’ అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడి భయంకరమైన ఈ మాటలు విన్నతరవాత కూడా కర్ణుడు ఉసిగొల్పడంతో, ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసి భీముడు అతికోపంతో సభలో అందరిమధ్యా ‘వీడి సిగ్గూ ఎగ్గూ లేని ఈ తొడను మహాయుద్ధంలో గదతో పగలగొడతాను’ అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రెండోసారి జూదంలో వనవాసానికి వెళ్లవలసివచ్చినప్పుడు, తన మహాబాహువుల బలానికి దీటుగా పరాక్రమాన్ని చూపిస్తానన్నట్టుగా భీముడు తన విశాల బాహువుల్ని చూసుకుంటూ ముందుకు నడిచాడు. కామ్యకవనంలో చొరబడుతూనే దుర్యోధనుడి మీద ఉన్న కోపాన్ని మొత్తమూ కిర్మీరుడనే రాక్షసుణ్ని చంపడంలో చూపించాడు. కిర్మీరుడు బకాసురుడి సోదరుడూ హిడింబుడి నేస్తం.అర్జునుడు అస్త్రాలను సంపాదించడానికి వెళ్లినప్పుడు, ద్రౌపదితో సహా ఆ నలుగురు పాండవులూ లోమశమహర్షి బృందంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి, అక్కడ గంధమాదన పర్వతం మీద భీముడితో ద్రౌపది విహరిస్తూన్నప్పుడు, సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగిరి వచ్చింది. దాన్ని చూసి ద్రౌపది ముచ్చటపడింది. భీముడు ఆ ముచ్చటను తీర్చడానికి ఆ పువ్వుల కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లాడు. పొగరుగా భీముడు ఈ దారిని వెళ్తే, దేవతలు శాపం పెట్టవచ్చునని, స్వర్గానికి వెళ్లేదారికి అడ్డంగా హనుమ పడుకున్నాడు. భీముడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. ‘దారికి అడ్డం తొలగవయ్యా ముసలాయనా’ అన్నాడు. ‘నేను ముసలివాణ్ని గదా. నువ్వే ఈ తోకను పక్కకు పెట్టి వెళ్లు’. అన్నాడు ఆంజనేయుడు. అంతేగదా అని ఎడమచేత్తో తీయబోయాడు. చేతగాలేదు. రెండు చేతులూ ఉపయోగించాడు. శాయశక్తులా ప్రయత్నించాడు. హతాశుడయ్యాడు. దానితో అతని గర్వం కాస్తా దిగింది. అప్పుడు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. తమ్ముడడిగితే, తన రూపాన్ని చూపించి, ‘అదుగో అటువైపు ఉంది సౌగంధిక పుష్పాలున్న నది.ఏం గొడవ చేయకుండా తీసుకొని వెళ్లు’ అని సలహా చెప్పి వెళ్లిపోయాడు. భీముడు అక్కడి రక్షకులను తరిమికొట్టి పువ్వుల్ని తీసుకొని వెనక్కు బయలు దేరాడు. అక్కణ్నించి ద్వైతవనానికి వచ్చాడు. ద్వైతవనంలో ఉన్నప్పుడే పాండవుల్ని అవమాన పరుద్దామని దుర్యోధనుడు సేనలతో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ గంధర్వులతో గిల్లికజ్జా పెట్టుకొని వాళ్ల చేతిలో ఓడిపోయాడు. ధర్మరాజు ఆజ్ఞమేరకు భీముడూ అర్జునుడూ వెళ్లి అతన్ని విడిపించారు. అక్కణ్నించి కామ్యకవనం వచ్చిన తరవాత ఓ రోజు ద్రౌపదిని, దుశ్శల భర్త జయద్రథుడు అపహరించబోగా భీమార్జునులు వాడి వెంటబడి బంధించి తెచ్చారు. విరాటనగరంలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు భీముడు వలలుడనే వంటవాడయ్యాడు. సైరంధ్రి అయిన ద్రౌపది, రాజుగారి బావమరిది కీచకుడి కంటబడింది. ఆ కాముకుడు ఆమె వెంటపడగా, రాత్రిపూట నాట్యశాలకు రమ్మనమని కీచకుడికి ద్రౌపదిచే చెప్పించి, అతను అక్కడికి రాగానే, రహస్యంగా అక్కడికి చేరిన భీముడు అతగాణ్ని మల్లయుద్ధంలో నుజ్జునుజ్జు చేశాడు. ఆ మీద కీచకుడి శవంతో సహా ద్రౌపదిని శ్మశానానికి తీసుకొని వెళ్తూన్నప్పుడు కీచకుడి తమ్ముళ్లనందర్నీ మూకుమ్మడిని చంపేశాడు భీముడు.అర్జునుడు సంశప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్లినప్పుడు, అభిమన్యుడు ద్రోణుడు వేసిన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి సాయంగా వెళ్లడానికి ప్రయత్నించిన పాండవుల్ని సైంధవుడు శివుడి వరం వల్ల అడ్డుకోగా ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ని ఆరుగురు ఒక్కసారిగా ముట్టడించి చంపేశారు. ఆ కారణంగానే సైంధవుణ్ని మర్నాటి సాయంత్రం లోపు చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. యుధిష్ఠిరుడు భీముణ్ని వాళ్లకు సాయంగా వెళ్లమన్నాడు. భీముణ్ని ద్రోణుడు అడ్డుకొన్నాడు. భీముడు ద్రోణుడు వేసే బాణాల వానను ఓర్చుకుంటూ అతని రథాన్ని విసిరిపారేశాడు. మళ్లీ ఇంకో రథమెక్కి వస్తే దాన్నీ అలాగే ఎత్తి విసిరేశాడు. ఇలా ఎనిమిది రథాల్ని విసిరి పారేసి అదను దొరికినప్పుడల్లా విరోధులను చంపుతూ దుశ్శాసనుణ్ని పట్టుకొని వాడి వక్షస్సును చీల్చి కసిగా రక్తాన్ని తాగాడు. చివర్లో దుర్యోధనుడు భయపడి మడుగులో దాక్కున్నాడు. పాండవులు అవమానపరుస్తూ మాట్లాడటంతో బయటికి వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు అతని తొడను విరగ్గొట్టి పడగొట్టాడు. భీష్ముడన్నా భీముడన్నా భయంకరుడనే అర్థం. కానీ వీళ్లు పెట్టే భయంలో తేడా ఉంది. భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నాడు. భీముడు తన అతిపరాక్రమంతో ధార్తరాష్ట్రులందర్నీ నేలకొరిగేలా చేశాడు.

Comments