ఈరోజు మంచు విష్ణు డిన్నర్ మీట్ పెట్టారు...రసవత్తరంగా మా ఎన్నికలు


మా ఎన్నికల నేపథ్యంలో విందు రాజకీయాలు ఊపందుకున్నాయి. పార్క్ హయత్ వేదికగా మా సభ్యులతో మంచు విష్ణు మంతనాలు జరుపుతున్నారు. మొన్న ప్రకాష్ రాజ్ లంచ్ మీట్ పెట్టారు. ఈరోజు మంచు విష్ణు డిన్నర్ మీట్ పెట్టారు. మా సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా.. మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా ఎన్నికల తేదీ దగ్గర పడడంతో.. అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ.. మాటల తూటాలతో దూసుకెళుతున్నారు. శనివారం ప్రకాశ్ రాజ్.. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రకాశ్ రాజ్ నిర్వహించిన సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మా ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై ప్రకాశ్ రాజ్ చర్చించారు. అంతేకాదు మా ఎన్నికల్లో తన ప్యానెల్ గెలిస్తే సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానంటూ ప్రకాష్ రాజ్ హామీనిచ్చారు. అంతేకాదు కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామని తెలిపారు. ఈ క్రమంలో మంచు విష్ణు పార్క్ హయత్ వేదికగా మా సభ్యులతో మంతనాలు జరుపుతుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రకాశ్ రాజ్ వలే.. మంచు విష్ణు కూడా ఎన్నికల హామీలను ఇచ్చే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు, ఓ కళ్యాణ్ లు ఎన్నికల రేస్లో ఉన్నారు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments