రామ్‌చరణ్- శంకర్ కాంబో మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది..


  మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మరో భారీ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి లెజెండరీ దర్శకుడు శంకర్ ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. రోబో-2 తర్వాత శంకర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మూవీ రిలీజ్ కాలేదు. ఇండియన్-2 సినిమా చేస్తున్నా అది సాంకేతిక కారణాల వల్ల పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీని అతడు టేకప్ చేశాడు. ఈ మూవీ ఈరోజే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా అందరూ ఒకే తరహాలో సూటు బూటు ధరించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొత్తగా డిజైన్ చేయగా మెగా ఫ్యాన్స్ ‘పోస్టర్‌ అదుర్స్’ అంటూ కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేసుకుంటున్నారు.

కాగా ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ఈ బ్యానరులో నిర్మితమవుతున్న 50వ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇది 15వ సినిమా. ఈ మూవీలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు శంకర్ తమిళం, హిందీ తర్వాత తెలుగులో నేరుగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. గత సినిమాల మాదిరిగానే ఈ మూవీని కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒకే ఒక్కడు మూవీకి సీక్వెల్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఈ మూవీకి అదిరిపోయే ఓ క్రేజీ టైటిల్‌ను అనుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విశ్వంభ‌ర‌’ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్‌ను ఈ చిత్ర బృందం ఏ మేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఇప్పటికే ఆమె చెర్రీతో వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏ శంకర్ ఏ సినిమా చేసినా ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ ఖర్చు చేసేవాడు. కానీ రామ్ చరణ్‌తో శంకర్ తీయబోయే సినిమాకు దిల్ రాజు ముందుగానే కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను ముందుగా అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేయనున్నట్లు సమాచారం.

Comments