పెళ్లిచేసుకొనే వరకు ప్రేమంటే తెలియదు నాకు...

ఇదేదో కొత్తగా ఉంది నాకే , భర్తకు ప్రేమలేఖ రాయటం. కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికెవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం అందుకే ఇలా..! చెప్పడం కంటే రాయడమే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే.

మీ ముందు ఎదురు పడి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి.నా జీవితం లో మొదటి సారిగా వ్రాస్తున్న ప్రేమలేఖ ఇదే తప్పులుంటే మాన్నిస్తారని ఆశిస్తూ... మిమ్మల్ని పెళ్లిచేసుకొనే వరకు ప్రేమంటే తెలియదు నాకు , నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా కొంత కాలం వరకు తెలియలేదు అనే చెప్పాలి. కానీ మన ఈ 5 సంవత్సరాల దాంపత్య జీవితంలో తెలిసిన మరో కొత్త విషయం ఏమిటంటే , నిజమైన ప్రేమంటే బయటకి కనపడేది మాత్రమే కాదు మనసుతో ముడిపడినది కూడా అని.
 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

కష్టపడి పని చేయాలనే మీ తత్వం ,ఇతరులకు సహాయం చేసే మీ మంచి గుణం, ఒక అర్ధాంగి అంటే బానిసలా కాకుండా ఒక సగటు మనిషిలా భావించి నాకు అన్నింటిలో స్వేచ్చని కల్పించే మీ మంచితనం. ఇవే మొదటగా మీలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నవి. మీరు ఒక్కరోజు ఇంట్లో లేకుంటే తెలుస్తుంది మీ మీద నాకున్న ప్రేమ ఎంతో. నా లోకం అంతా చీకటిగా అనిపిస్తుంది ఆ రోజంతా, కానీ ఎన్ని రోజులైనా మీ ప్రేమ మాత్రం ఎప్పుడూ బయటపడేది కాదు , పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్ కి వెళ్లింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవరకు రోజుకి ఒకసారైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురుచూసేదాన్ని , కానీ చేయలేదు. దానికి మీ సమాధానం "పెళ్ళైన కొత్తలో ఒకలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత మరోలాగా ఉండడం నాకు రాదు. నేను అలా నటించలేను, నేను నాలానే ఉంటాను అని " ఆ మాట విన్న మరుక్షణం బాధ పడ్డ మాట వాస్తవమే అయినా ,తరువాత కాలం లో నేను బాధపడకూడదు అన్న ఉద్దేశ్యంతోనే అలా అన్నారని అర్ధమైంది.ఇలా ఒకటి కాదు చాలా విషయాలలో అలా ఎంతో ముందుచూపుతో ఆలోచించే మీ మనసు నాకు నచ్చింది. 

మీ ప్రేమ బయటకి కనపడక పోయినా నేను ఇష్టపడింది నాకు దక్కినప్పుడు మీకు కలిగే ఆనందం లో ఆ ప్రేమ నాకు కనపడింది. నేను సరదాగా అడిగినవి కూడా మనసులో పెట్టుకుని ఎప్పటికైనా నాకు అందచేయడానికి మీరు పడే తాపత్రయం నేను గమనించాను. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు మనం తరచూ గొడవ పడుతున్నాము, చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద విగా చేసి చూస్తున్నాము. ఇందులో నా తప్పు కూడా ఉంది అని గ్రహించే సరికి మీరు కోప్పడి వెళ్లిపోతున్నారు. అప్పుడు నా మీద నాకే ఎంతో కోపం వచ్చేది ,ఎవరో ఒకరు సర్దుకుంటే బాగుండు, అది నేనే అయితే ఏమవుతుంది ? పాపం అనవసరంగా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడే గొడవ పెట్టుకున్నాను. అదే ఆలోచిస్తూ బైక్ నడుపుతారేమో ఎక్కడ మీకు ఏమవుతుందో అని ఆరోజంతా నా మనసు మనసులో ఉండేది కాదు. మరలా సాయంత్రం మీరు ఇంటికి వచ్చేవరకు మీ మీదనే నా ధ్యాసంతా. కానీ ఆ గొడవ తరువాత మన మధ్య పుట్టే ప్రేమ మధురం. ఆ తరువాతే నిర్ణయించుకున్నాను ఇంకెప్పుడూ మీ మనసుని నొప్పించే విధముగా మాట్లాడకూడదు అని. తరువాత మనం గొడవలు పడ్డ రోజులు గుర్తే లేవు. అంతలా మన ప్రేమ మనల్ని దగ్గర చేసింది.కానీ అలకలు ఆడవారికి కవచకుండలాలు అంటారు కదా, అవి ఎక్కడికి పోతాయి మమ్మల్ని వదిలి.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

 అలా నేను అలక పాన్పు ఎక్కిన ప్రతిసారి మీరు నన్ను బ్రతిమాలే సమయంలో మీ మొహంలోని అమాయకత్వం నాకెంతో ఇష్టం. ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ బ్రతిమాలడం మానేస్తారో అని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదనే అనుకోండి లేకుంటే మరలా బ్రతిమాలడం మానేస్తారు.మన ప్రేమకి గుర్తుగా పుట్టిన మనబాబు రూపంలో మన బంధం ఇంకాస్త బలపడింది. వాడిని కనే క్రమంలో నేను పడే బాధను చూసి మీరు రాత్రంతా నిద్రపోకుండా నాకు తోడుగా నా పక్కనే ఉన్నారు. ఆ క్షణంలో మీ ముఖంలో నా పట్ల ఉన్న ప్రేమ, నాకోసం మీరు పడే బాధ నేను గమనించాను. తరువాత రోజు ఉదయం ఉదయించే సూర్యుడిలాగా ఎంతో ప్రకాశంతో , తేజోవంతంగా వెలిగిపోతున్న మన బాబుని మొదటిసారి మీ చేతులలోకి తీసుకున్న ఆ క్షణం మీ కళ్ళలోని ఆనందం నాకు ఇంకా కళ్ళముందే ఉంది. వాడి రాకతో మన జీవితాలలో ఎంతో మార్పు వచ్చింది , మన ఇద్దరి జీవితలలోకి వెలుగుని తెచ్చి మనకు కొత్త ఆనందాలని తీసుకు వచ్చాడు.వాడి రాక మనకు కొత్త బాధ్యతలని తెచ్చింది , భార్య భర్తల నుండి అమ్మ నాన్న ల పదవిని పొందాము. ఆ తరువాత మన బాబుని పెంచే ఆ క్రమంలో మీలోని మరో మనిషిని చూసాను.

 కొడుకుని చూసి మురిసిపోయే తండ్రిగా , వాడిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే మీ ఆశయం నాకెంతో నచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా నాకు బయటకి కనపడని ప్రేమ ఇప్పుడు వీడి రాకతో మీలో చూడగలిగాను. అదే క్రమంలో వాడికి సంబందించిన ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే మీ జాగ్రత్త నచ్చింది.ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ గురించి. ఇలా తెలుసుకున్న ప్రతిసారీ మీ మీద నా ప్రేమ పెరుగుతూ వచ్చింది , మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ పాదదాసిగా ఇదే నా కోరిక. కాదు కాదు పాదదాసిగా అంటే మీకు నచ్చదు కదూ... పాదదాసి అన్న ప్రతిసారి మీరు అనే ఒక మాట "పాద దాసి కాదు నాలో సగం" అని. అది విన్న ప్రతిసారి మీరు భార్యా భర్తల బంధానికి ఇచ్చే విలువ అర్ధమయ్యేది , అందుకే మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని, కుదిరితే మళ్ళీ జన్మలో కూడా ఉండాలని మీలో సగం అయిన నా కోరిక. ఈ ఉత్తరం చదివిన తరువాత మాత్రం దయచేసి నేను అలిగినప్పుడు నన్ను బ్రతిమాలడం మాత్రం మానొద్దు అని మనవి.

 AP & TS Govt Jobs , University Results , Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs

Comments